Penchalakona.co.in

Sree Vaari Temple

Sthala Purana

History of the Temple

శ్రీ ఛత్రవటి క్షేత్ర చరిత్ర

 

శ్లో॥ జ్వాలాహోబిల మాలోల క్రోడా కారశ్చ భార్గవః ।

యోగానంద శ్చత్రవట: పవనో నవ మూర్తయః॥

శ్లో॥ ఆదిలక్ష్మీ సమేతాయ వాంచితార్ధ ప్రదాయినే ।

మహాశిల గిరీశాయ శ్రీ నృసింహాయ తే నమః ॥

శ్రీ నవ నారసింహ పుణ్య క్షేత్రములలో శ్రీ పెనుశిల లక్ష్మీ నృసింహస్వామి క్షేత్రము మిక్కిలి ప్రసిద్ధమైనది. ఈ క్షేత్రము నెల్లూరు జిల్లా, రాపూరు మండలం, గోనుపల్లి గ్రామమునకు 7 కి. మీ. దూరమున నెల్లూరు పట్టణమునకు పశ్చిమ భాగమున 80 కి.మీ. దూరములో ఉన్నది. ఇచ్చట లక్ష్మి నరసింహ స్వామి నవ నారసింహులలో ఒకరుగా పిలవబడుచున్నారు. శ్రీ స్వామివారు చెంచులక్ష్మీ సమేతుడై నిరాకార రూపమున స్వయంభువుగా వెలసి యున్నారు. అల్లంత దూరమున ఆదిలక్ష్మీ అమ్మవారునూ స్వయంభువుగా వెలసి ఈ దేవ దేవేరులు భక్తాభీష్ట ఫలప్రదులై బ్రోచేవారలను కరుణించి ఫలముల నొసంగుచున్నారు. దశావతారములలో మేటియై కృతయుగమున అవతరించిన నాలుగవ అవతారము నృసింహావతారము. ఈ అవతారమున దుష్ట శిక్షణ శిష్ట రక్షణలు అనగా దుష్ట దానవుడైన హిరణ్యకశిపుని వధ, భక్తప్రహ్లాద రక్షణ చేసి తనచే సృజింపబడు ముక్త జీవులను తరింపజేయుటకు ఇలపై నవ నారసింహులుగా స్థిరమైనారు. ఇట్టి క్షేత్రములలో ఈ ఛత్రవటి నారసింహ క్షేత్రము అత్యంత మహిమాన్వితమైనది. నృసింహావతారమున హిరణ్యకశిపుని వధానంతరం ఉగ్రరూపుడైన నారసింహుడు సర్వం విష్ణుమయం జగత్ అను రీతిగా ఈ జగత్తునంతటా సర్వవాప్తియై భక్తుల అభీష్టము మేరకు అచ్చటచ్చట అవతరించినాడు. ఈ క్షేత్రము చెంచురాజులకు నిలయమైనందున ఉగ్రరూపుడైన నారసింహుడు సుందరాంగియైన చెంచు వనిత చెలిమితో శాంతించి చెంచురాజులకు కప్పము చెల్లించి చెంచుపట్టిని చేపట్టి పరిణయమాడి ఆ సుందర వనితను పెనవేసుకొని నిరాకార శిలా రూపమున స్థిరమైనట్లు చరిత్ర వలన తెలియచున్నది.

ఈ క్షేత్రము తూర్పు కనుమల మధ్య పర్వత పాదమున సముద్ర మట్టమునకు సుమారు 3000 అడుగుల ఎత్తున ఉన్నది. ఈ స్వయమవతారమూర్తి వెనుక భాగమున మహాశిల గిరి(గొప్ప పర్వతరాజము) కలదు. ఇది పన్నగాకృతిగా నెల్లూరు, కడప, జిల్లాల మధ్య భాగమున హిమగిరితూర్పు పశ్చిమ సముద్రములకు కొలబద్దమానముగా నున్నట్లు, ఉత్తర దక్షిణముగ, శ్రీశైల, వరాహ (వేంకటాచల) క్షేత్రమునకు కొలబద్దవలె కన్పించును. ఈ సర్పాకృతిగాకల పర్వతముల యొక్క శిరోభాగమున వరాహక్షేత్రమున వేంకటేశ్వరుడు వెలసెను. కటి భాగమున ఈ క్షేత్రమున (శ్రీ పెనుశిల క్షేత్రము) ఛత్రవటి నారసింహుడు వెలసి స్థితి కారకుడై తనను ఆరాధించు భక్తులకువరములు నొసంగుచుండ లయ చక్రవర్తియైన పార్వతీశు డు శ్రీశైల క్షేత్రమున వాల(అంత్య) భాగమున వెలసి ఆర్తులను ఆనందింపజేయుచున్నాడు. ఈ గిరి శిఖరముల నుండి జాలువారు వర్షపు నీటి ధారలు వెండికరిగి మూసలో పోయురీతిన స్వచ్ఛముగా నుండి పర్వతపాద భాగమున ఉన్న కణ్వనదియందు ప్రవేశించి తద్వారా దిగువ గల గ్రామాలకు వరప్రసాదియై కండలేరు జలాశయమున నిక్షిప్తమగుచున్నది. ఈ క్షేత్ర నదీ తీరమున శాకుంతల సంరక్షకుడైన కణ్వ ఋషి మహాతపమోనర్చి స్వయంభువైన శ్రీనృసింహుని ఆరాధించినట్లు పరంపరాగతమైన దివ్య. సూక్తి. అలనాడు మహర్షులచే ఆరాధింపబడిన పెనుశిలేశుడు ఈనాడు భక్త సులభుడై కోరిన వరములు ఇచ్చుచున్నాడు. ఈ స్వామి చెంచు వనితైన లక్ష్మిదేవిని పెనవేసుకొని అవతరించి యుండుటచే పెనుశిల క్షేత్రమే కాలగమనమున రూపాంతరము చెంది పెంచలకోనగా మారి పామరుల హృదయములలో స్థిర నామ రూపమైనది. ఈ ప్రాంతము వారు నేటికినీ తమ సంతానములకు పెంచలయ్య, పెంచలమ్మ అని స్వామి వారి పేరు పెట్టుకొనుట జరుగుచున్నది. ఈ పర్వతారణ్య మహాక్షేత్రమున మహోత్సవములకు (నృసింహాజయంతి) వచ్చు అసంఖ్యాక భక్తకోటికి క్రిమి కీటకాది బాధలు కూడాకలుగవు. ఇచ్చట సేవ చేయువారికి సర్వగ్రహదోషములు నివారణ అగును, మరియు సంతానము లేనివారు వరపడు సేవచే సంతాన ప్రాప్తులగుదురు. ఇది నేటికిని సత్యముగా జరుగుచున్నది.

ఈ క్షేత్రమున ప్రతిదినం త్రికాలారాధనలు జరుగుచున్నవి. వైశాఖ మాసమున బ్రహ్మోత్సములు, ఆశ్వీయుజ మాసమున శరన్నవరాత్రి ఉత్సవములు మిక్కిలి శోభాయమానముగా జరుగును. ఈ క్షేత్రమున క్షేత్రపాలకుడుగా శ్రీఆంజనేయ స్వామివారిని ఆరాధించుచున్నారు. పూర్వము గోనుపల్లి గ్రామమునకు సమీపమున ఉన్న అరణ్యము నందు ఆవులను మేపుకొను గొల్లబోయునకు శ్రీవారు నేను ఈ కొండల నడుమ శిలారూపమున వెలియచున్నాను. కావున నీవు మీ గ్రామమునకు వెనుతిరిగి చూడకుండా పోయి గ్రామ పెద్దలకు తెలియజేసి నా వద్దకు రావలసినదిగా చెప్పినారు. శ్రీహరి భక్తుడైన గొల్లబోయుడు గోనుపల్లి సమీపమునకు వెళ్ళి వెనుతిరిగి చూడగా శ్రీహరి మాటను ధిక్కరించినందులకు గాను స్వామివారు కోపించి శిలారూపమును దాల్చమని శపించెను. అంతట గొల్లబోయుడు అజ్ఞానముతో చేసిన తన తప్పును క్షమించమని ప్రార్థించగా భక్తసులభుడైన శ్రీహరి శాంతించి తన వద్దకు వచ్చు భక్తులు ప్రథమముగా నిన్ను దర్శించి పిదప నన్ను దర్శించెదరని గొల్లబోయునకు వరమొసంగెను. ఈ గోల్లబోయని ఆలయము గోనుపల్లి గ్రామమునకు సమీపమున ఉన్నది. మరియు సప్తఋషుల నామములతో సప్త సరస్సులు రమణీయమైన ఈ ప్రదేశమున నెలకొనియున్నవి. ఈ క్షేత్రమున స్వామి వారికి ముఖ్యదినము శనివారముగా భావించి భక్తులు కొనియాడెదరు. శ్రీవారికి జరుగు బ్రహ్మోత్సవములు, వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు ప్రారంభమై శు ద్ధ చతుర్దశి (జయంతిరోజు) గరుడసేవ ప్రధానముగా పాంచరాత్ర ఆగమానుసారం పంచాహ్నికముగా జరుగును. శ్రీ నృసింహజయంతి గరుడ సేవరోజు శ్రీవారిని సేవించుకొను భక్తగణము అసంఖ్యాకముగా వచ్చుదురు. ఈ క్షేత్రమునకు సమీపమున 5 కి.మీ. దూరమున భైరవకోన యను పుణ్య స్థలము గలదు. అచ్చట శ్రీవారి మహోత్సవ పూర్వోత్తర కాలమందు సుమారు ఒక నెల వరకు శ్రీ స్వామి వారి స్నానాద్యనుష్టానములను కావించు కొందురని ఆ సమయమున సప్త ఋషులు స్వామి వారికి దివ్యఛత్రము పట్టెదరని నానుడి. ఈ దృశ్యమును నేటికిని భానోదయ కాలమున భక్తులు తిలకించుచుందురు ఈ కారణములచేత స్వామి వారికి ఛత్రవటి నారసింహ స్వామి అనెడి పేరు సార్ధకమైనది.

Penchalakona temple is one of the Nava Narasimha temples which all are located with in Andhra and Telangana states. List is as follows, Lord Narasimha even after killing Hiranya Kasyapa, he could not control his anger and he came to the forest. To cool him down, Goddess Laxmi approached him in the form of a tribal lady named Chenchu Laxmi and hugged lord at this place. The Hug is telugu is called as “Penu Vesukonuta”. Hence this place is called as Penusila and later changed as Penchalakona. It is said that Lord married Chenchu Laxmi and manifested himself as huge rock.

The Annual festival of the temple brahmostavam starts on Vishaka Shudda ekadaashi during the month of APR and May, which is a Major festival at Penchalakona and is celebrated over 5 days every year.